అద్వైతానందలహరి
సర్వం శ్రీకృష్ణపరబ్రహ్మార్పణమస్తు !
ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते |
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ||
ॐ शान्तिः शान्तिः शान्तिः ||
ప్రార్థన:
భాషదోషములన్ని భవుని పాదముందుంచి
తప్పు మన్నింపుమని తనువు వంచి
ఆత్మ జ్ఞానమునకై అర్థించి నిలిచాను
నాలోన వున్న నీకు నిదుర చాలు!
అలలు నురగలు నామ రూపమ్ములే సుమ్మి
కనుపించు సత్యము కరిగిపోయెను చూడు
నీరు కాక నిజము నిర్వచించ తగున
అద్వైత మార్గమే పరమ సుఖము – 1
మిసిమి గాజులలోన పసిడి కానరాదు
ఉంగరమ్ముల ఉనికి తెలుపలేము
ఉన్నదొక్కటే పసిడి వివరంచి చూడగా
అద్వైత మార్గమే పరమ సుఖము – 2
నేను నాదనియు భ్రాంతి తొలగించలేము
‘అది’యే మనమను కాంతి దర్శించలేము
ఎరుక కలిగిన నాడు ఆత్మ ఒక్కటేనయా
అద్వైత మార్గమే పరమ సుఖము – 3
మూర్తిలోనే కాదు మురికినందు కలడు
వెతకి చూచిన కలడు రిపులయందు
వెనుక మరలి చూడు మనయందే కలడు
అద్వైత మార్గమే పరమ సుఖము – 4
భోగభాగ్యమ్ముల భోగిమంటలు పేర్చు
ఇంద్రియమ్ముల కడిగి మనసు నిల్పు
ఇహము పరమను అజ్ఞానమును వీడు
అద్వైత మార్గమే పరమ సుఖము – 5
ముక్తి పొందటమనగ ముక్కు మూయుటగాదు
యోగ శాస్త్రమనగ యుక్తి గాదు
పరమేశ్వరుని ఉనికి పరమ గూఢము కాదు
అద్వైత మార్గమే పరమ సుఖము – 6
సక్తి కూడిన భక్తి సత్యమ్ము కారాదు
నడుము వంచుట లేదు యోగ బలము
ధ్యాసలేని దృష్టి ధ్యానమార్గమున పోదు
అద్వైత మార్గమే పరమ సుఖము – 7
బేధ భావములోన బాధయే మిగులురా
సమదృష్టి లోనే సత్యముండు
అన్నింటిలోనా ఆ దైవమే కలదు
అద్వైత మార్గమే పరమ సుఖము – 8
కర్మ ముందు కలదు సంగమించిన మనసు
సంకల్పమే దాని తల్లి తండ్రి
యోగమన్న కనగ ఆలోచనా త్యాగమే
అద్వైత మార్గమే పరమ సుఖము – 9
కలలోన కలుగవా కలిమిలేముల కుందు
ఇలలోన ఎరుగమా ఈతి బాధ
ఏది నిజమన్నదో ఎరుకగలిగి చూడు
అద్వైత మార్గమే పరమ సుఖము – 10
ఉన్నదెపుడు పోదు లేనిదేమో రాదు
కన్నదెపుడు కాదు పరమ నిజము
మిన్నకుండి చూడు మమేకమున నీవు
అద్వైత మార్గమే పరమ సుఖము – 11
సగము నిండిన కుండ సద్దు మనగదు చూడు
నిండుకుండ నిలుచు నిశ్చలముగ
పండిపోయిన మనసు పరుగులాపును కదా
అద్వైత మార్గమే పరమ సుఖము -12
కారు చీకటిలోన పాము త్రాడై పోవు
తెలివి గలిగిన మనకు తొలగు భయము
లేనిదున్నట్లుండు లోలోన మాయరా
అద్వైత మార్గమే పరమ సుఖము -13
బ్రహ్మమంటే మూడు తలల పిండము కాదు
భవబంధములు తొలచు భక్తి గాని
ఆలోచనలు ఆపి అనుభవించి చూడు
అద్వైత మార్గమే పరమ సుఖము – 14
వెలతి కప్పుకొనుటకు వేవేల మాటలు
మౌనమందే కలదు మంచి తెలివి
నిష్క్రమించి చూడు నిజపథమ్ములు మెండు
అద్వైత మార్గమే పరమ సుఖము – 15
తల్లి ఇచ్చిన తనువు తపనలందున పడవైకు
సేవ చేసి ఋణము సేద తీర్చు
తత్వమెరుగుటకే గాని తనువుతో పనిలేదు
అద్వైత మార్గమే పరమ సుఖము – 16
వావి వరసలు లేవు వివరించి చూడగా
బంధమన్న దుఃఖమవని తప్ప
పుట్టినపుడు నీకు పేరైన లేదాయె
అద్వైత మార్గమే పరమ సుఖము – 17
నామాలు వేరైనా సారూప్యమొక్కటే
శివకేశవులన్న రెండు దేవుళ్ళు కారు
పేరులేని ఆత్మకు రూపమెక్కడిదయా
అద్వైత మార్గమే పరమ సుఖము – 18
సత్యంబు పలుకగా సత్వమును కోరు
సమదృష్టి కలుగగా స్వాంతమును సేయి
అన్నిటా వున్నది ఆత్మయని తెలుసుకో
అద్వైత మార్గమే పరమ సుఖము – 19
ఉద్ధరింపగ నిన్ను వేరెవ్వడును రాడు
పురుషకారమే నీకు పరమ పథము
శత్రుమిత్రులిద్దరు నీకు నువ్వేనయా
అద్వైత మార్గమే పరమ సుఖము – 20
ఎండమావిలోన నీరు వున్నట్లుండు
నీకు కనిపించునది ఉట్టి కల్ల
మాయ చేసిన సృష్టి మనకు తోచిన ద్రుష్టి
అద్వైత మార్గమే పరమ సుఖము – 21
కాషాయ వస్త్రాలు వీభూథి రేఖలు
మెళ్ళోన మాలలు మరిపింపలేవు
సన్యాసమంటేను సత్ నందు న్యాసమే
అద్వైత మార్గమే పరమ సుఖము – 22
విభుని వెతకంగ వీధిలో పడబోకు
పరమేశ్వరుని ఎరుగంగ పస్తుండబోకు
ఎరుక చేసుకో వాడు ఎదలోనే వున్నాడు
అద్వైత మార్గమే పరమ సుఖము – 23
పాప పుణ్యంబులు ప్రారబ్ధ కర్మలు
శీతోష్ణములు లేక లాభనష్టములు
ఆత్మకేవీ అంటవీఉట్టి మాయలు
అద్వైత మార్గమే పరమ సుఖము – 24
అన్ని జన్మలలోన మనిషి జన్మే మిన్న
కామ్య కర్మలు చేసి కాల్చబోకు
జ్ఞానమవలంబించి నిజ పథమ్మున జేరు
అద్వైత మార్గమే పరమ సుఖము – 25
ఉత్త రాయిని జేరి ఉలికి దెబ్బేసిన
మొక్కబడెడి మూర్తి ముదము గూర్చు
రూపమైన రాయి మనసులోని మాయరా
అద్వైత మార్గమే పరమ సుఖము – 26
కోర్కెలన్నీ తీర్చమని కొబ్బరీ కొట్టేవు
విభునితో వ్యాపారమెట్లు పొసఁగు
అంటిముట్టనిది ఆత్మ తత్వమయా
అద్వైత మార్గమే పరమ సుఖము – 27
అది నాది ఇది నాది స్వార్థచింతనకాది
మనసుపై మనకున్న మమకారమేను
అహము వీడి చూడు ఆత్మ ఒక్కటే కలదు
అద్వైత మార్గమే పరమ సుఖము – 28
నువ్వు చేసిన కర్మ నిన్ను వెంటాడురా
ఫలము కోరిననాడు తరచి చూడ
త్యాగబుద్ధొక్కటే తలపోయు తరియింప
అద్వైత మార్గమే పరమ సుఖము – 29
గురువు లేని విద్య గుడ్డివిద్యే కాదు
గురిలేని శరమై గ్రుచ్చునెపుడు
గురుతుచేసేవాడె నిజమైన గురువురా
అద్వైత మార్గమే పరమ సుఖము – 30
పదిమందిని దెచ్చి పరమాన్నమును జేసి
పంచిఇవ్వటముకాదు పుణ్యమంటే
ఇచ్చింది ఇసుకైన ఈశ్వరార్పణము జేయి
అద్వైత మార్గమే పరమ సుఖము – 31
పరమాత్మ అంటేను పైనెక్కడోలేడు
వేలచేతులతోను ఊడిపడడు
అన్నిటా వున్నాడు అందులో నువ్వొకటి
అద్వైత మార్గమే పరమ సుఖము – 32
కొండ పిండిని జేయ కండలూర్చుటకు గాదు
చిలికిగంథాలతో చెలిమికీ గాదు
దేహమన్న ఉనికి ధర్మమార్గమునకే
అద్వైత మార్గమే పరమ సుఖము – 33
మనసు కోర్కెలన్ని కరి మూటలేనురా
బరువు పెరగవచ్చు లేక తరుగవచ్చు
మూట లేని మనసు మునిని జేయును నిన్ను
అద్వైత మార్గమే పరమ సుఖము – 34
విశ్వమంటే వేల రూపాల నిధి గాదు
విబుధ జనులకు తెలుసు విశ్వేశుడేనని
సర్వాత్మతత్వమే సరియైన దృష్ఠిరా
అద్వైత మార్గమే పరమ సుఖము – 35
నవరంధ్రమ్ముల ఢక్క మలమూత్రమ్ముల ముక్క
తనువు తపనల చింత చెరగిపోయే లెక్క
నిత్యముండేదొకటే నిజమైన ఆత్మ
అద్వైత మార్గమే పరమ సుఖము – 36
మతము పలికెడి మాట మాయలో పడబోకు
మాటలొక్కటేగాని మర్మమెరుగదు
ఉన్న మతిని వెతుకు ఒక్కటే నిజామురా
అద్వైత మార్గమే పరమ సుఖము – 37
విశ్వమంటే వెఱయ వెలుపల వస్తువు గాదు
అద్దమందగుపించు బింబమేను
అన్ని చూపించునది జ్ఞాన దర్పణమ్మేర
అద్వైత మార్గమే పరమ సుఖము – 38
కోర్కెలన్నియుగూడి కర్మ బంధములుగ మారి
వీడిపోక జనుల విషము జేయు
ఫలము విడిచి చూడు పరమాత్మవవుదురా
అద్వైత మార్గమే పరమ సుఖము – 39
ముక్కుమూసి మునక గంగలో వేసేవు
మనసుకంటిన మకిలి మాన్పగలదే
చిత్తశుద్దికేర చదువ చేష్టలన్నీగూడ
అద్వైత మార్గమే పరమ సుఖము – 40
మాటనందు లేదు మంత్రమ్మునలేదు
భాష తెలుపగలేదు భవుని గరిమ
మౌనమందే గలదు మర్మమంతయును
అద్వైత మార్గమే పరమ సుఖము – 41
కనులకగుపించునది కల్ల ఇలలోన కలలోన
తలపులన్నియు కూడ తపన తళుకే
ఇంద్రియమ్ముల మాయ ఇంతింత కాదయా
అద్వైత మార్గమే పరమ సుఖము – 42
తళుకు బెళుకుల తనువు తమకంబు చేకూర్చు
కాలగతుల కలసి కరగిపోవు
ముడుతలేర్పడువేళ ముక్తికై వెతికేవు
అద్వైత మార్గమే పరమ సుఖము – 43
లేనిదాని వెంట లేకివై తిరిగేవు
ఉన్నదానితోడ తృప్తి లేదు
నీవు తెచ్చినదేది నిజము చూడర నరుడ
అద్వైత మార్గమే పరమ సుఖము – 44
లక్షవత్తులు చేసి లెక్కించు ఒక్కండు
మల్లె కోటిని దెచ్చి పూజించునింకొకడు
తలపులోగలదురా తాత్పర్యమంతా
అద్వైత మార్గమే పరమ సుఖము – 45
వేషభాషలు మార్చి వేయి పూజలు చేసి
వరములడిగిన వాడు వెఱ్ఱివాడు
శరణు కోరి చూడు సత్యంబు కనవచ్చు
అద్వైత మార్గమే పరమ సుఖము – 46
కులమతంబులు కలవు కలసియుండుటకే
భిన్నముగ చూచినచో ఖిన్నుడైపోగలవు
సకల గోదావరులు సాగరమ్మునకే చేరు
అద్వైత మార్గమే పరమ సుఖము – 47
వచ్చిపోయేటివే సుఖదుఃఖః వృత్తాలు
నిత్య సాక్షికిమాత్రవంటవీ శాపాలు
శుద్ధ ముక్తుడవీవు గురుతు చేసిన చాలు
అద్వైత మార్గమే పరమ సుఖము – 48
వెళ్ళిపోయిన రోజు వెనుకకు మరలి రాదు
ముందు జరుగెడి ముప్పు ముంజేత లేదు
వ్యర్థ వ్యాజమును మాని వివేకివై మెలగరా
అద్వైత మార్గమే పరమ సుఖము – 49
శ్రవణ మననము మరియు నిధిధ్యాసనమును చూడ
సాయుధ్యమును చేకూర్చు మూడు మెట్లు
సమయంబు వెచ్చించి సామాన్యమును తెలుసుకో
అద్వైత మార్గమే పరమ సుఖము – 50