తెలుగు పలుకు

August 18th, 2015

అమ్మ పలుకు కన్న ఆచారమింకేది
తండ్రి మాట కన్న తత్వమేది
ఆచార్యుడిని మించిన ఆత్మజ్ఞానమేది
నిజము చెప్పెద వినుము నిగ్గుగాను

నవమి తెచ్చును మీకు నవధాన్య సంపత్తి, తరిగిపోని శాంతి తామసగుణ కీర్తి
కోరివచ్చును మీకు భక్తి జ్ఞాన ప్రపత్తి, సత్సంగముల శక్తి శృతుల రక్తి
కరుణపై మీకు కలుగు కమనీయ స్పూర్తి, భూతదయపై ఆర్తి మెండు భక్తి
రామచంద్రుని పాదాలపై సక్తి, మీకెల్లరకును కలుగు అవధిలేని ముక్తి

భోగభాగ్యములతో తులతూగులెల్లరున్
రాగ ద్వేషంబులను వీడి భక్తి గూడి
సాగరాగదా మనకు సిరిగూడి సంక్రాంతి
పగలు లేని చోట వెలుగు కాంతి

రక్షయనుచు సహోదరి ప్రేమ
అక్ష సౌఖ్యములనిచ్చు మీకు
దక్షతతో కాచుమీ అక్కచెల్లెళ్ళను
సుక్షత్రితయతన్ సహోదరా!

చేరి కొలుతుమమ్మ చేతులారంగ మేము
మీరి మనసు పండ నిండు మిసిమి
దారి చూపుమమ్మ దీనులకు నేడు
వారిజాక్ష మాకపుడే విజయదశమి !

శాకాంబరీ దేవి కరుణా కాటాక్షంబు
పాక శాస్త్రంబులో మేలయిన మణిపూస
ఏక నారాధ్యమ్ము గోంగూర పచ్చడి
నాకి చూడు నరుఁడ నెమ్మగాను !

దోర దొరఁగ మెండు దోసకాయలు తెచ్చి
మీర ముక్కలుజేసి నుప్పు జేర్చి
కారమంతయుఁ నావపిండితో మగ్గేసిన
ఊరకుండునా జిహ్వ నుర్వినెల్ల?

వరుడు కోరాడమ్మ వధువంటి వలపు
వధువు గుండెల్లోన వరుడంత తలపు
మించి బొమ్మలకొలువు మిరుమిట్లు గొలుపు
మంచి గంధాల చిలుకు మీకిదియే మా పిలుపు !